మహాలయ పక్షాల ప్రాధాన్యత


*మహాలయ పక్షాల ప్రాధాన్యత*
    ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన విషయం
భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ *‘మహాలయ పక్షములు*’ అంటారు.(ఈ నెల 25.09.2018 నుండి 9.10.2018 వరకు ) మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది  పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము.

*పితృదేవతలకు ... ఆకలా?*

అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.
             
*అన్నాద్భవంతి భూతాని  పర్జన్యాదన్న సంభవః
             
యఙ్ఞాద్భవతి పర్జన్యో  -  యఙ్ఞః కర్మ సముద్భవః

అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే....దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే... వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని  అడగొచ్చు.

మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద  ‘జీవాత్మ’గా అవతరించడానికి...  అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష  ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి  అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి  పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే ‘మోక్షం’ అంటే. రేపు మనకైనా ఇంతే.

*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*

అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి  పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక  మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ  *‘మహాలయ పక్షాలు’* పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం  చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు.  వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.

*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*

- సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.

- క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి ‘చేత భరణి లేక భరణి పంచమి’ తిథులలో అనగా..మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

- భార్య మరణించిన వాడు ‘అవిధవ నవమి’నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం  పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర,రవికెలగుడ్డ  పెట్టి   సత్కరించి పంపాలి.

- చిన్న పిల్లలు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. చిన్న పిల్లలు అంటే..ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ      పది సంవత్సరముల వయస్సు లోపే  ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి.

- ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ‘ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి’నాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

మహాలయము పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరము) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. ఐదుగురు భోక్తలు ఎందుకంటే...

1.పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. కనుక విష్ణుదేవతా ప్రీత్యర్థం ఒక భోక్త.

2.ఇది విశ్వేదేవస్థానం. విశ్వ, ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త.

3.ఇది పితృస్థానం.  తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.

4.ఇది మాతామహస్థానం. తల్లి తండ్రి, తాత, ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త.

5.ఇది సర్వ కారుణ్యస్థానం. తండ్రి తరపు బంధువుల, తల్లి తరపు బంధువుల, గురువుల, స్నేహితుల, తక్కినవారి ప్రీత్యర్థం ఒక భోక్త.

ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం ఈ పితృకార్యాన్ని హోమ, తర్పణ, పిండప్రదానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే.. ‘శ్రద్ధయా క్రియతే ధేయం ..శ్రాద్ధం’ అన్నారు పెద్దలు. అయిదుగురు భోక్తలతో ఈ పితృయఙ్ఞం జరిపించే ఆర్థికస్థోమత లేని పక్షంలో...కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గానీ...మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. 🌻🌻🌻.        

Comments

Please follow, Like, Comment and share

101 గ్రామ దేవతల పేర్లు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

Remedy for wealth and hapiness

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018

South direction dakshina dikku దక్షిణ దిక్కుకి తిరిగి ఎందుకు నమస్కరించ కూడదు?

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

108 శక్తి పీఠాలు:

తద్దినాలు పెట్టడము అవసరమా