* తొలి ఏకాదశి విశిష్టత *

*ఈ రోజు తొలి ఏకాదశి* (23 జులై 2018)

👉  శాంతాకారం  భుజగశయనం,
పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం
మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం
 యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం
 సర్వలోకైక నాధం!!

® ●ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు.
◆ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

◆ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట!

◆ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి
 *'ఉత్థాన ఏకాదశి'* వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి.

◆ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.

◆ఈ 'తొలి ఏకాదశి' నాడు *"గోపద్మ వ్రతం"* చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.
◆ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.
◆అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.
ఇంత పుణ్యప్రదమైన *తొలిఏకాదశి* పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము.

తొలి ఏకాదశి ప్రాశస్త్యం - విశిష్టత - వ్రతం -
పాటించాల్సిన విధివిధానాలు

ప్రధమైకాదశి అను సంస్కృతి నామాన్ని బట్టి తెలుగు వారు దీనిని తొలి ఏకాదశి అని వ్యవహరి స్తున్నారు. సంవత్సరానికి 24 ఏకాదశులు... అందునా అధికమాసంలో ఇరవై ఆరు ఏకాదశు లు వచ్చినా ప్రధమైకాదశి, మహా ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశిని గొప్పగా చెప్పడానికి కారణాలు వున్నాయి. సంవత్సరానికి అయనములు రెండు. అందునా దక్షిణాయన పుణ్యకాలం యందు పండుగలు అధికంగా వస్తాయి. అంతేకాక ఆరోగ్యం కోసం నియమాలు ఎక్కువగా పాటించాల్సిన అవసరం రీత్యా పెద్దవారు అనేక వ్రతాలు పెట్టారు. అట్టి పండుగలను ప్రారంభం ఈ ఏకాదశి నుంచే. ఇంకో విధంగా చూస్తే చాతుర్మాస్యదీక్ష దినాల ఏకాదశుల్లో మొదటిది కావడం వలన కూడా దీనికి ప్రధమైకాదశి అని పేరు వచ్చింది. అసలు ఈ తొలి ఏకాదశి పండుగ గురించి బ్రహ్మవైవర్త పురాణం లో వివరంగా ఉంది. ఈ ఏకాదశి విశిష్టమైనది. విష్ణుమూర్తికి ప్రియమైనది. ఈ రోజు హరిశయ నోత్సవం జరుపుతారు. శేషశాయి అయిన లక్ష్మీనారాయణలిరువురినీ కూడా భక్తితో శ్రద్ధగా పూజి స్తారు. కనీసం ఈనాడు ఏకభుక్తమైనా ఉపవాసం ఉంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస్య వ్రతారం భం. శివ విష్ణు భక్తులిద్దరూ చేసే వ్రతమిది.
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే ఏకాదశి అంటారు.
ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.
ఏకాదశి రోజున శ్రీహరిని పూజించండం మంచిది

ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు.
ఈ రోజు నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకూ విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై పండుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాలలో చెపుతారు. అం టే వ్రతము తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చేస్తారు. ఇంకొక పౌరాణిక గాథలో విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తిక శుద్ధ ఏకాదశికి తిరిగి వస్తాడని అంటారు.
అయితే క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనించుట వల్ల హరిశయనైకాదశి అనే పేరు కూడా ఉం ది. అలాగే శయనైకాదశి అని కూడా అంటుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తొలి ఏకాదశి అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఎందుకంటే పండుగల ప్రారంభానికి పండుగగా!

తినకూడనివి, విసర్జించవలసిన పదార్థాలు...

గుడం (బెల్లం), తైలం (నూనెలు), కాల్చినవి, మాంసాహారం, కొత్త ఉసిరి, చింతపండు, పుచ్చకాయ, గుమ్మడికాయ, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, మంచంపై పడుకొనుట, బయట భుజించుట తగవు. ఈ నాలుగు నెలలు ఇవన్నీ పనికి రానివిగా గుర్తించాలి. బుద్ధుడు చాతుర్మాస్య వ్రతమాచరించినట్లు జాతక కథలలో చాల చోట్ల చెప్పబడింది. జైనులు (అహింసా వ్రతాన్ని పాటిస్తారు). చాతుర్మాస్య వ్రతాన్ని వారు పాటిస్తారు నేటికీ!అసలు ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి చతుర్మాస్య వ్రతాకల్పం ప్రారం భించాలని భగవంతుడు యుధిష్ఠరునకు చెప్పినట్లు అందున్నది. ఈ వ్రతంలో పిప్పల వృక్షం ప్రధానం అంటే ఆ వృక్షానికి ప్రదక్షిణ, దేవాలయాల్లో దీపారధన, ఈ వ్రతంలో సరస్వతీ పూజ కూడా ఉంది.

శ్రీ నారాయణ స్తుతి...

సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశమ్భవమ్‌
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్‌
అంటే... అనంత శిరస్సులు, అనంతమైన నేత్రములు కలవాడు, విశ్వమంతటికీ సుఖములు కలిగించేవాడు, సర్వ ప్రాణులనూ ఆధారభూతుడు, శాశ్వతుడు, అన్ని లోకాలకు శుభములను కలిగించే వాడు, మంగళ కరుడు, మోక్ష ప్రదాత అయిన శ్రీ మహా విష్ణువుకు నమస్కారం!
అసలు చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి!...

ఈ నాలుగు నెలలు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ గడపాలి. విష్ణువును నివేదన చేశాకనే! ఆహారం తీసు కోవాలి. యతులకు ఇది చాలా ముఖ్యమైన వ్రతం. గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని చేయచ్చు.
బౌద్ధులలో చాతుర్మాసం...
చాతుర్మాస్య వ్రతం హిందువులలోనే కాక బౌద్ధమతస్థులలో కూడా వుంది. వారికి జూలై నెల లో ఏదో ఒక రోజున బర్మియు వాసో అనే మాసం ఆరంభమవుతుంది. ఆ వాసో మాసపు పూర్ణిమ రోజున బౌద్ధుల చతుర్మాస్య వ్రతం మొదలవుతుంది. క్రైస్తవ మతంలో లెంట్‌ నామంతో నలుబది దినాల ఉపవాసాల పండుగగా క్రైస్తవులకు ఉందనవచ్చును. అంటే హిందు, బౌద్ధ, క్రైస్తవులలో రకరకాలుగా చెప్పవచ్చును.
బౌద్ధుల చాతుర్మాస్య వ్రతంలో వాసో వృక్షం, పంచశీల పఠనం రెండూ ప్రధానంగా వుంటా యి. బౌద్ధ యువతీ, యువకులు పౌర్ణమి వెళ్ళిన తర్వాత కలసి వనాలకు వెళ్ళి పసుపు పచ్చని పూలతో ఆకర్షణీయంగా పూచిన వాసో వృక్షం పుష్పాలని గంపల కొద్దీ తీసుకెళ్ళి బుద్ధ దేవునికి స్తారు. బౌద్ధ విహారాల్లో, గృహ దేవతా పూజకీ బాగా వాడతారు.
అయితే సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండలేకపోయినా చతుర్మాస్యాల్లోని (8 ఏకాదశులు కదా నాలుగు నెలలకి) ఏకాదశులైనా మనం ఉపవాసం వుంటే మంచిది. (వంకాయ, రాగి, తరుబూజ ఈ ఏకాదశుల్లో తినగూడదని శాస్త్ర వచనం).అయితే యతులకు ఈ వ్రతం ఆచరించటానికి కొన్ని సూచనలున్నాయి. వ్యాస మహర్షిని పూజిం చాలి, ముండనం చేయించుకోవాలి, మరల వ్రతం సమాప్తం అయ్యే వరకూ క్షవరం పనికిరాదు.చాతుర్మాస్య వ్రతం అయ్యేదాక నిమ్మపళ్ళు, అలసందెలు (బొబ్బర్లు), ముల్లంగి, గుమ్మడి, చెరుకు... వీటిని వర్జించాలిట.
మొదటి నెల కూరలు, రెండో నెల పెరుగు, మూడవ నెల పాలును, నాల్గవ నెల ద్విదళ పత్ర శాకములున్నూ అన్నంతో అధరువులుగా వాడచ్చు. (కూరలు, పచ్చళ్లు మొదలైనవి ఏవీ తీసు కొనరాదు). ఇవన్నీ శరీర స్వాస్థ్యం కోసమే. సన్యాసి అంటే ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఊరిలో గడిపేటటువంటి వాడై (అతన్నే గ్రామైక రాతడు అంటారు) వుండాలి. అయితే వర్షాకాలము నాలుగు నెలలు అతడు ఒక్క చోటనే గడపవచ్చును. అలా గడపటాన్ని చాతుర్మస్య వ్రతంగా పేర్కొంటారు.
అయితే ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు (కార్తిక శుద్ధ ఏకాదశి వరకు) ప్రతి దినం ఆవుల కోష్టాన్ని పరిశుభ్రం చేసి, అలంకరించి, బియ్యపు పిండితో 23 పద్మాలు వేసి, గంధ పుష్పాక్షతలతో పూజించి, ప్రదక్షణ నమస్కారాలు చేసి, పద్మాలు ఎన్ని ఉన్నాయో అన్ని అప్ప ములను, వాయనములను బ్రాహ్మణులకు ఇవ్వాలి.
కొట్టాల నడుమ మండపం ఏర్పరచి అందులో విష్ణువు ప్రతిమనుంచి ఆరాధించి, గోవుల్ని పూజించాలి అంటారు. ఈ ప్రధమ ఏకాదశికి పండరీపురంలో పెద్ద జాతర జరుగుతుంది. సతీసక్కుబాయి ముక్తి పొం దింది ప్రధమ ఏకాదశి నాడే అని మహారాష్టల్రో ఆ మహాసాధ్వి గుర్తుగా ఉత్సవాన్ని జరుపుతా రు. అయితే ఆంధ్ర దేశంలోనూ అత్యంత ఘనంగా అన్ని వైష్ణవాలయాల్లో ఈ నాటి రాత్రి విష్ణు శయన వ్రతాలు చేస్తారు. ఈనాటి నుంచి నాలుగు మాసాల పాటు ప్రతిదినము పురాణ గ్రంథా లు పఠిస్తారు.
ఉభయ గోదావరి జిల్లాలలో...
మాగాణి గ్రామాల్లో వ్యవసాయదారులు ఆనాడు కొత్త పాలేరుని కుదుర్చుకుంటారు. తొలి ఏకాదశి నాడు గాని, ఆ మర్నాటి నుంచి గాని క్రొత్త పాలేరును పిలిచి కొత్త బట్టలు ఇచ్చి పండి వంటలతో భోజనం పెట్టటం ఆనవాయితీ.

గుంటూరు జిల్లాలో...

దీన్ని ఈ ప్రాంతం వారు పేలపుపిండి పండుగ అంటారు. అంటే పేలాలు విసిరి బెల్లంలో కలుపుకొని తింటారని, దాన్ని వంట మీద జల్లుకుంటారని అది వారి ఆచారమని కొందరు అంటుంటారు.

నెల్లూరు పరిసరాలు...

ఏరు ముందా? ఏకాదశి ముందా? అని అక్కడ సామెతలు. పెన్నా నదికి ఆ సమయానికి కొత్త నీరు వస్తుందని ఈ ఏకాదశికి కొంచెం ముందు వెనుకగా! ఏరువాక పనులకి ఉత్కంఠంగా ఎదురు చూసే నెల్లూరు ప్రాంతవాసులకి ఇది ఆనందకరమైన పండుగ!ఇక హిందువులు ఈనాడు రాత్రి పూట సంపూర్ణంగా విష్ణుమూర్తి దేవాలయాల్లో విష్ణుమూర్తిని ఆభరణాదులతో అలంకరించి జాజి పువ్వులతో పూజించి, పవళింపు సేవ చేసి, కీర్తనలు పాడి, విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తారు. ప్రతి పండుగకి పరమార్ధం వుంది. ప్రతి పండుగకి విశిష్టతతో పాటుగా ఆచరించాల్సిన ఆరోగ్య సూత్రాలు సమ్మిళితమై వున్నాయి. దాన్ని సద్వినియోగ పరచుకొని ఆరోగ్యం, ధాన్యం, భక్తి, ముక్తి పొందటం మానవ ధర్మం!
ఇవాల్టి ప్రధమకృత్యం బౌద్ధ భిక్షువులకు బహుమానాలు. గృహస్థులు కొందరు కలసి బహుమాన ప్రధానాలు చేస్తారు భిక్షువులకు! అసలు బౌద్ధభిక్షువులు బర్మా భాషలో పొంగేయిన్‌ అంటారు. బహుమతులు తీసుకున్న బౌద్ధ భిక్షువులు తివాసీలు పరచిన అరుగుమీద కూర్చొని పంచశీలాలు పేర్కొంటారు. అది విని మిగిలిన ప్రజలు తిరిగి చెపుతారు. దాని తర్వాత అంతా విందు భోజనాలు. ఆ తర్వా త గృహస్థులు ఫలహారాలు స్వీకరిస్తారు. బౌద్ధ భిక్షువులకు వారిచ్చే బహుమానాలు కొత్త దుస్తులు, పాదుకలు, గొడుసలు, కంబళ్లు... వారి ఆశ్రమవాసానికి ఉపయోగపడేవి వుంటాయి. వాసో నెలలో ప్రారంభం అయ్యి తాడిం గ్యూట్‌ అను నెలలో ముగుస్తుంది (జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌... నాలుగు మాసాలు నడుస్తుంది).
ఈ నాలుగు మాసాలు వారు తమ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళరు. వెళ్లాల్సి వచ్చినా అక్కడ నిద్రించక ఆ రాత్రికే తమ ఆశ్రమానికి వస్తారు. బౌద్ధుల అభిప్రాయం మానవలోకం కన్నా ఉత్తమమైన లోకంలో బుద్ధుడు ఈ నాలుగు నెలలు తల్లితో వుంటాడని అంటే మాతబోధ, జ్ఞానబోధతో, ఉపవాసాలతో, ప్రార్ధనలతో ఈ నాలుగు నెలలు వెళ్లదీస్తారు.నాలుగు నెలల చివరికి (తాడిం గ్యూట్‌ మాసం పౌర్ణమినాడు) చాతుర్మాస్య వ్రతానికి ఆఖరి రోజున వారి గురువైన బుద్ధుడు భూమి మీదకి వస్తాడని నమ్మకం! దీపతోరణాలతో ఆనాడు బుద్ధునికి అందరూ స్వాగతం ఇచ్చి ఉపచారాలు చేస్తారు!
అంటే ఈ తొలి ఏకాదశి నాడు హిందువులైన, బౌద్ధులైనా వారి వారి మతాన్ని, నమ్మకాన్ని విశ్వాసాన్ని, అనుసరించి వారి వారి దైవాలని ఎంతో శ్రద్ధగా, భక్తిగా, రంగరంగ వైభవంగా పూజించి ఉపవాసాలు వుండి భక్తితో కొలచి ధ్యానం చేస్తారు.ఆషాఢ శుద్ధమే ప్రధమైకాదశి. ఆరోగ్య నిమిత్తమే ఈ వ్రతమని పెద్దలు చెబుతారు.
వర్షాకాలం ఆరంభం కనుక క్రిమి కీటకాలకు పుట్టిల్లు. రోగాలు కొత్తవి పుట్టటం వల్ల ఇపుడు చెప్పిన (విస ర్జించవలసిన పదార్ధాలు) పదార్ధాలు తినకూడనివి అన్నీ త్రిదోష ప్రకోపనములే! అందువల్ల మిత పథ్యాహారలతో గడుపుట మంచిది.అసలు విష్ణువంటే సూర్యుడే. అంతవరకూ ఉత్తర దిక్కుగా వున్న సూర్యుడు ఈనాటి నుండి దక్షిణ దిక్కుగా వాలినట్లు కనపడటం వల్లే విష్ణువు శయనించాడని, ఈ రోజు గోపద్మ వ్రతమా చరించాలని పెద్దల సూచన!

★ 🌹 *చాతుర్మాస్యం*🌹 ★


👉 ●ఆషాఢ శుద్ధ ఏకాదశిని  శయనైకాదశి  అంటారు.ఆరోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కొంటాడు.ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.

★ ఈ కాలంలో యతులు  ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకేచోట ఉండి అనుష్టానం చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం.
★ చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి *'అర్థచాతుర్మాస్యం*' అనే పేరుతో చేస్తున్నారు. ఈ వ్రతాచరణకు స్త్రీ, పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మొదలైనవారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన, బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది .

★ ఈ వ్రతము చేస్తే సంవత్సర కాలపు పాపాలు పోతాయని, చెయ్యని వారికి పాపాలన్నీ సంక్రమిస్తాయన్నది ఓ విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు గానీ, వీలుకాకపోతే కటక సంక్రాంతి, కాకపొతే ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలని చెప్తారు.

👉 *చాతుర్మాస్యం*

*శేష తల్పంపై నిద్రిస్తున్న విష్ణువు.*
ప్రారంభంశయన ఏకాదశిముగింపుప్రబోధిని ఏకాదశిఆవృత్తివార్షికం

👉 *ఆరోగ్య సూత్రం*

◆ ఈ వ్రతం వ్రతాచరణ చేసేవారి ఆరోగ్య పరిరక్షణ కోసమేనని ఓ పరిశీలన .
◆ఆషాఢం నుంచి నాలుగు నెలలు వర్షాలు బాగా పడుతుంటాయి, నేల బురద మయమవుతుంది .. ఇలాంటి తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది .
◆చాతుర్మాస్య వ్రతములో పాటించే ఆహార, విహారాది నియమాల ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.

👉 *చరిత్ర*
ఈ చాతుర్మాస వ్రతం ఆచరించడమనేది ఇటీవలి కాలంలో వచ్చినది కాదు. యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య, స్కాంద పురాణాలలోని కథనాల వలన అవగతమవుతుంది .
◆ఒకప్పుడు ఇప్పటిలాగా కాక నాలుగు నెలలుపాటు కొనసాగే ఋతువులు మూడే ఉండేవట .
◆అనంతర కాలంలో రెండేసి నెలల పాటు ఉండే ఆరు ఋతువులుగా అవి మారాయి .
◆తొలినాళ్ళలో వర్ష, హేమంత, వసంత - అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి . వర్ష ఋతువుతోనే సంవత్సరము ఆరంభామవుతూ ఉండేది . ఈ కారణం వల్ల సంవత్సరానికి " వర్షం " అనే పేరు వచ్చింది.
◆సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలములో ఒక్క ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తుండేవారు .
◆ ఆషాఢ పూర్ణిమ నుండి 'వరుణ ప్రఘాస యజ్ఞం', కార్తీక పూర్ణిమ నుండి 'సాకమేద యజ్ఞం', ఫాల్గుణ పూర్ణిమ నుండి 'వైశ్వ దేవయజ్ఞము ' చేస్తూ ఉండేవారు . ఆ నాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి ' చాతుర్మాస్య వ్రతము' గా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతున్నారు . చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా --
👉 ® *శ్రావణమాసంలో "ఆకుకూరలను ", భాద్రపద మాసంలో "పెరుగును"  ఆశ్వయుజ మాసంలో "పాలను " కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి* .. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు .

★ పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును . ఈ ఆహార నియమాలన్నీ .. వాత, పిత్త, శ్లేష్మ -సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస్య వ్రతదీక్ష అనేది - మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాజ్మయం వివరిస్తోంది .

★ ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్ వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః

👉 *వ్రత నియమాలు*

★ ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటరాదు.ఈ కాలంలో అరుణోదయవేళ స్నానం చేయడం అవసరం.వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి.ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి.
★ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి.భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి.యోగసాధన చేయడం శ్రేయస్కరం.దానధర్మాది కార్యాలు విశేష ఫలాన్నిస్తాయి.

👉 *వ్రత వృత్తాంతము*
చతుర్మాసాలు అంటే, ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు గల సమయం నాలుగు నెలలు. ఆషాఢ, శ్రావణ, బాధ్రపద, ఆశ్వయుజ మాసాల్లోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి. చివరిది దేవ ఉత్థాన ఏకాదశి.
★  క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు భూశయనం చేయటం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాట, ఆవనూనెల సేవనం మానివేయటం, నిరంతర జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపటం, రోజూ ఒకే పూట భోజనం చేయటం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయటం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. పీఠాధిపతులు, దీక్షితులు ఒకే స్థానంలో నివసించటం, క్షురకర్మలు నిషేధించడం వంటి నియమాలు పాటిస్తారు. శ్రావణ, బాధ్రపద మాసాలు గృహస్థుల నియమాలకు సరైనవని పద్మపురాణం తెలుపుతోంది. బాధ్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంటారు. హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పక తన భార్యకు దూరమై అనేక ఇక్కట్ల పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని, చివరికి విజయం చేకూరిందని చెబుతారు. చాతుర్మాస్య దీక్షలో గోపద్మవ్రతం గురించి మూడు పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి.

👉 *నారేళ్ళనాచి కథ*

ఒకసారి కైలాసంలో శివునిచేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి- చేయి మెత్తగా, మృదువుగా ఉండటానికి కారణం అడిగింది. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే 'ఎముక లేని చెయ్యి' అని దానం చేసేవారిని వర్ణిస్తారు. పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్లింది. నారేళ్ళనాచి అనే పేరు గల గర్భిణికి చేయూతనిచ్చి, సేవచేసి, 11 రోజుల తరువాత సకలైశ్వర్యాలు కలగజేసి, చాతుర్మాస్య గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. అయిదేళ్ళ తరువాత అమ్మకు నారేళ్ళనాచి పరిస్థితిని తెలుసుకోవాలని పించింది. అప్పుడు నారేళ్ళనాచి గోపద్మవ్రత ఉద్యాపన చేసుకొంటోంది. పార్వతి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచి నీళ్ళడిగింది. నారేళ్ళనాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తనవారితో చెప్పింది.
◆ అవమానపడిన పార్వతి తిరిగి శివుని దగ్గరకు వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరింది. అది సాధ్యపడదన్నాడు శివుడు. విష్ణువూ తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ళనాచికి తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి, క్షమించమని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు.

👉 *రాజు రాణి కథ*

ఇదే విధంగా ఒక రాజు సంతానం లేని కారణంగా చెరువులు, బావులు తవ్వించడం, బాటలు వేయించడం, బాటల పక్క చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు అయిదుగురు సంతానాన్ని పొంది, తన మొదటి భార్యలో గల ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేశాడు. మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయనివారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలని తన భటులను కోరాడట.

👉 *సుభద్ర వ్రతాచరణ*

తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదని తెలిసిన శ్రీకృష్ణుడు వెంటనే సుభద్ర వద్దకు వెళ్ళి అయిదేళ్ళ వ్రతాన్ని ఒకేరోజు జరిపించాడట. దాంతో యమభటులకు జయభేరిని మోగించడానికి చర్మం లభించలేదట. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకొన్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా తెచ్చి జయభేరి మోగించాలన్నాడట యముడు. అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండటం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారని కథనం.

👉 *ముత్తైదువులు*

చాతుర్మాస్య గోపద్మ వ్రతంలో ముత్త్తెదువలు తొలి ఏకాదశి నుంచి ప్రతిరోజు కొన్ని చొప్పున 1100 వత్తులు, 11 వందల ముగ్గులు పెట్టుకుంటారు. అయిదేళ్ళు నోముకున్నాక కన్నెముత్తైదువకు పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు, భోజనం, బియ్యం, నువ్వుపిండి పెట్టి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. దూర్వాలతో గౌరమ్మను పూజించి, తులసికోటవద్ద దీపం వెలిగిస్తారు. జామపండ్లు, సీతాఫలాలు, చెరకు, ఖర్జూర పండ్లు వంటివాటితో కన్నె పిల్లల ఒడినింపి, గౌరమ్మకు నమస్కరిస్తారు. పరోపకారం, సేవాభావం, పరులను గౌరవించడం, చాతుర్మాస్య నియమాలు పాటించడం- మానవాళికి ఎంతో శుభం, ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం.
🙏 సర్వే జన సుఖీనోభవంతు!!  🙏


Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

108 శక్తి పీఠాలు:

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కారాలు - ముహూర్తములు

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

వరలక్ష్మి వ్రతం