*సంక్రాంతి సంబరాలు*
*తెలుగు వారి పెద్దపండుగ సంక్రాంతి.*
మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో దైవానికి సంబంధించినవే.!
కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. రైతుల పండుగ. కళాకారుల పండుగ. ఈ పండుగ కు మూలపురుషుడు రైతన్న.ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది.
తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు.వాళ్ళ వివరాలు తెలుసుకుందాం.
బుడబుక్కలవాడు:
ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది.
పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిఝూములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ క్రొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా 'కట్టు' కట్టి కట్టడి చేసేవాడు బుడబుక్కలవాడు.ఇతను తొలిఝామంతా పంటకు కాపలా కాసి రెండోఝాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతాడు
జంగందేవర:
సాక్షాత్తూ శివుని అవతార అంశలుగా భావించే ఈ జంగందేవరలు శంఖనాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర!
హరిదాసు:
'హరిలో రంగ హరి'అంటూ శ్రీకృష్ణుని గాధలను కీర్తిస్తూ ఇంటింటి ముంగిటికీ వచ్చి పొలం వెళ్ళిన రైతుల క్షేమసమాచారాలను వాళ్ళ ఇళ్ళలో తెలుపుతూ హరినామసంకీర్తనామృతాన్ని దోసిళ్ళతో అందించి దోసెడు బియ్యాన్ని కృష్ణార్పణమంటూ స్వీకరిస్తాడు.ఆ యదుకులేశుని ఆశీస్సులను తన ద్వారా మనకు అందిస్తాడు.
గంగిరెడ్లు:
హరిదాసు ఇంటిలోని వారిని పలకరించి ఇంటి ఆడపడుచులు వేసిన రంగవల్లులపై కృష్ణపరమాత్మ ఆశీస్సులు కురిపించాక
'అయ్యగారికి దండం పెట్టు
అమ్మగారికి దండం పెట్టు
బాబుగారికి దండంపెట్టు
పాపగారికి దండం పెట్టూ'
అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి,రైతు బ్రతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటి ముంగిట్లో ఎడ్ల ఆట ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించిన గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి ఊదుకుంటూ వెళ్ళిపోతారు
పిట్టలదొరలు:
గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు,కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. తనకు ఆరేబియా సముద్రంలో ఆరువేల ఎకరాల భూమి ఉందని,బంగాళాఖాతంలో బంగ్లాలున్నాయని ఆ బంగ్లాలకు వెళ్ళడానికి సరైన దారిలేక ఈమధ్యనే బొప్పాయి కలపతో బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టించాననీ అవన్నీ పిల్లలు అడిగితే ఇచ్చేస్తానని డంబాలు పోతాడు.పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు
సోదెమ్మ
సోదెమ్మ వెళ్ళిన తరువాత మన భవిష్యత్ ఫలాలను చెబుతానంటూ
'సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను
ఉన్నదున్నట్టు చెబుతాను లేనీదేమీ చెప్పను తల్లీ'అంటూ మన భావిలో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర,రవికల గుడ్డ పెట్టించుకుని పోతుంది.
భట్రాజులు:
ఆరు నెలల కష్టానికి ఫలితం వచ్చేవేళలో ధాన్యాన్ని ఇంటికి తరలించే సమయంలో రైతుల కళ్ళాలలోకి వెళ్ళి రైతుని ఆతని వంశాన్ని ఆతని పెద్దలనూ పొగడుతూ ఆ రైతు కుటుంబం నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ పద్యాలల్లి ఆశీస్సులను వెదజల్లి ఓ కుంచెడో రెండు కుంచాలో ధాన్యాన్ని కొలిపించుకుని భుజాలకెత్తుకుంటారీ భట్రాజులు.
కొమ్మదాసర్లు:
అన్ని పనులు పూర్తి చేసుకున్న తరువాత కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఈ కొమ్మదాసరోడు వచ్చి పెరట్లో చెట్టుకొమ్మనెక్కి 'అప్పయ్య గోరో పడతా పడతా నే పప్పుదాకలో పడతా,పడతా పడతా నే పాతరగోతిలో పడతా'అంటూ అల్లరి చేస్తాడు.అమ్మలక్కలు,పిల్లలు చెట్ల క్రింద జేరి క్రిందకు దిగమని బ్రతిమాలతారు.ఆ పాతరగోతి మీద పాతబట్టలు పరచమని చెప్పి వాటిని పట్టుకెడతాడు.
ఇక్కడ పాతరగోతి గురించి చెప్పాలి.పూర్వం పండిన పంటను ఇంటికి తెచ్చి పెరట్లో గొయ్యి తవ్వి ఆ గోతిలో తాటాకులు కొబ్బరాకులు పరిచి వాటీపైన గడ్డి పరిచి మెత్తను తయారుచేసి ఆపైన ధాన్యం పోసి నిలవచేసే వారు.
దీనినే పాతరగొయ్యి అంటారు.పొద్దన్నుంచి పని చేసి చేసి అలసి సొలసి నిద్రపోతారేమో ఇదే సందని దొంగలు ఆ గోతిని తవ్వి పండిన పంటనంతా దోచుకుపోవచ్చు.మీ పాతరగొయ్యి సరిగా ఉందో లేదో ఓ సారి చూసుకోండి అని చెప్పడానికి ఈ కొమ్మదాసరి వస్తాడు.
ఈవిధంగా ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మన పొలాలకు పహారా ఇస్తారు.
మనకింత సాయం చేసిన వాళ్ళకు మనమేమిస్తున్నాము???
నాలుగు గుప్పెళ్ళ బియ్యం,నాలుగు పాత గుడ్డపీలికలు.
ఇంటిల్లిపాది మంచిని కోరుకుంటూ మన ముంగిటికొచ్చే కళాకారులను ఆదరించండి!!!
వెండితెరపై, బుల్లితెరపై ఓ సారి కనబడిన వాళ్ళందరికీ వేలు,లక్షలు పోసి వాళ్ళ వెకిలి చేష్టలను ఆనందించేకన్నా మన సౌఖ్యాన్ని,మన సౌభాగ్యాన్ని కోరుకునే ఈ పల్లె కళాకారులను అక్కున జేర్చుకుందాం!!!!!!
మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం..........
నిజమైన సంక్రాంతి సంబరాలను చేసుకుందాం.........
Comments
Post a Comment