సంస్కారాలు - ముహూర్తములు

   మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది.

వివాహము
 ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల రోజులలో వివాహము మంచిదే.

లగ్నంలో పాపగ్రహములు లగ్నాత్ సప్తమంలో పాపగ్రహములు లేకుండా వివాహ సుముహూర్తము చేయాలి. ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు వివాహమునకు గ్రాహ్యము కాదు అని కొందరి వాదన వున్నది. అది కూడా గ్రంథాధారమే కానీ వాటిల్లో కొందరు మహర్షులు శ్రేష్ఠము అని చెప్పిన కారణంగా అందరూ ఆచరిస్తున్నారు. చిత్తా నక్షత్రం గ్రాహ్యం కాదని వాదన. లగ్నాత్ కేంద్రములు అనే 1,4,7,10 స్థానములలో శుభ గ్రహములు వుండడం దృష్ట్యా వివాహ లగ్నమునకు బలం ఎక్కువ అని చెప్పాలి. లగ్నాత్ 1,4,5,7,9,10 స్థానములలో శుభగ్రహ సంచారం విశేష లాభ ఫలితాలు ఇస్తుంది. అవకాశం వున్నంతవరకు 1,7 స్థానములలో పాపగ్రహములు లేకుండానే నిర్ణయం చేయాలి. శుక్ర గ్రహమునకు పాపగ్రహం సంబంధం లేకుండాను అలాగే చంద్రగ్రహం వున్న నక్షత్రంలో పాపగ్రహం లేకుండాను చేసుకోవాలి. కారణం కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే మనఃకారకుడు చంద్రుడు. అలాగే వీలయినంతవరకు గురు బలం అధికంగా వున్న ముహూర్తం నిర్ణయించాలి.

గర్భాదానము
స్త్రీ, పురుషులు (భార్యభర్తలు) ఇద్దరు కలసి ఒక కొత్త ప్రాణికి జీవం పోయడామే గర్భాదానము. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ అండాశయంలో ఏర్పడిన అండంనకు పురుషునిలో ఉత్పత్తి అయిన వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీ గర్భం దాల్చి నూతన జీవి పుట్టుకకు అవకాశం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల చిత్త వృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన శిశువే జన్మిస్తారు. కావున తల్లిదండ్రులు గర్భాదాన సమయమున తాము దేవతలమని, పతి ప్రజాపతి యొక్క అంశ గలవాడని, పత్ని వసుమతి రూపమని తలచి దేవతా చింతనము చేయుచు గర్భాదానము చేయవలెను.

పుంసవనం
తల్లి గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.

సీమంతం
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేదే సీమంతం. తొలి గర్భదారణ విషయంలో 4, 6, 8 మాసములలో చేయుట శాస్త్ర సమ్మతము. అయితే 5, 7, 9 మాసములలో చేయుట ఆచారము. పుంసవనమునకు అష్టమ శుద్ధి కావలెను. సీమంతమునకు అష్టమ, నవమ శుద్ధులు రెండూ కావాలి. సీమంతర అనివార్య కార్యముల వలన చేయలేనిచో ప్రాయశ్చిత్తముగా గోదానము చేయాలి.

గర్భిణీపతి ధర్మాలు
భార్య గర్భవతిగా వున్నప్పుడు "గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాత్ యధోచితం" భార్య కోరిన ఉచితమైన కోరికలు భర్త తీర్చవలెను. విదేశీ ప్రయాణము, చెట్ల నరుకుట, 7వ మాసం నుంచి క్షౌరము, మైధునము, తీర్ధయాత్ర, శ్రాద్ధ భోజనము, నావప్రయాణము, వాస్తుకర్మలు, సముద్ర స్థానము, ప్రేతకర్మలు నిషేధము. గర్భిణీపతి స్వపితృకర్మలు చేయవచ్చును.

బారసాల
తనని పరిపూర్ణ స్త్రీగా నిరూపించిన తన బంగారు బిడ్డకి అన్ని వేళలా తోడుగా ఉంటూ ప్రతిక్షణం తనదిగా, తన లోకంగా ఉండే చిన్నారి బిడ్డకు తొలుత చేసే ముచ్చటైన వేడుక బారసాల. మంగళ, శనివారములు పనికి రావు. అష్టమి ద్వాదశి, నవమి, అమావాస్య తిధులు పనికిరావు. బారసాల రోజునాయితే ఆ రోజు సాయంత్రం వర్జ దుర్ముహూర్తములు లేకుండా ఊయలల్లో నూతనముగా శిశువును వుంచవచ్చును. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ట, పు.షా, పుభా, నక్షత్రములు పనికి రావు.

క్షౌరం + పుట్టు వెంట్రుకలు
షష్ఠి, అష్టమి, నవమి, చవతి, చతుర్దశి, అమావాస్య, ద్వాదశి, పాడ్యమి తిధులు పనికి రావు. శుక్ర, మంగళ శనివారములు కూడదు. పుష్య, పునర్వసు, రేవతి, హస్త, శ్రవణ, ధనిష్ఠ, మృగశిర, అశ్వని, చిత్ర, శతభిషం, స్వాతి ఇవి ప్రసస్తములు ఉత్తర తూర్పు దిక్కుగా కూర్చొని క్షౌరం చేయించుకోవాలి. నిత్యంలో సోమ, బుధవార విషయములలో తిధి, నక్షత్రం పట్టింపు లేదు.

అన్నప్రాసన
మగపిల్లల విషయంలో 6వ మాసం అన్నప్రాసన చేయలి. 5వ మాసం మొదలు బేసి మాసముల యందు ఆడపిల్లల విషయములో అన్నప్రాసన చేయాలి. 6వ నెల 6వ రోజు అనేది కుసంస్కారము. అది దుష్టాచారము. అన్నప్రసనతోనే పిల్లల ఆరోగ్య విషయాలు ఉంటాయి. అందు కోసం మంచి ముహూర్తానికే అన్నప్రసన చేయాలి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడం, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్త్రాభాద్ర, రేవతి నక్షత్రములయందు చేయవలెను. ఆది, శని, మంగళవారములు నిషేధం. జన్మలగ్నం, అష్టమ లగ్నం కాకుండగను, దశమస్థానం శుద్ధి ఉన్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను.

గర్భధానం
అశ్వని, భరణి, ఆశ్రేష, మఘ,మూల, జ్యేష్ఠ, రేవతి నక్షత్రముల పూర్తి నిషేధము. జన్మ, నైధన, తారలు కాకూడదు. ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, మృగశిర, హస్త అనూరాధ,శ్రవణం, ధనిష్టం, శతభిషం, రోహిణి స్వాతీ నక్షత్రములు విశేషములు. రెండు పక్షములలోని షష్ఠి అనధ్యయన దినములు ఏకాదశులు , ఆది మంగళ వారములు సంక్రమణ దినములు శ్రాద్ధ దినములు గర్భదానమునకు నిషేధదినములు వివాహం అయిన 16 రోజులలోపు గర్భదానమునకు ముహూర్తమును చూడనవసరం లేదు అనునది అశాస్త్రీయ విషయము. భార్య భర్తల భవిష్య ఆరోగ్య విషయములో గర్భాధాన ముహూర్తం ముఖ్య భూమిక వహిస్తుంది. వ్రతములు ఆచరించు దినములలో సంగమం నిషేధం.

చెవులు కుట్టుట
జన్మించిన 12వ లేదా 16వ రోజును లేక 6వ, 7వ, 8 నెలలయందైననూ పూర్వాహ్న, మధ్యాహ్న కాలములలో సోమ, బుధ, గురు, శుక్రవారములలో శ్రవణం, అర్ద్ర, హస్త, చిత్త, మృగశిర,రేవతి, ఉత్తర ఉత్తరాషాఢ, ఉత్తరాభాధ్ర, పుష్యమి, పునర్వసు, ధనిష్టయందు కుంభ, వృశ్చిక, సింహ లగ్నములు కాకుండా, అష్టమ శుద్దితో కూడిన లగ్నమునందు చెవులు కుట్టుట మంచిది.

అక్షరాభ్యాసం
ఉత్తరాయణం శ్రేష్ఠం. హస్త పునర్వసు, స్వాతి, అనూరాధ, అర్ద్ర, రేవతి, అశ్వని, చిత్త, శ్రవణములయందు ఆది, మంగళ, శనివారములు కాకుండాను చరరాశి లగ్నమందు రిక్తతిధులు షష్ఠి, అష్టమి విడిచి అనధ్యయన దినములు కాకుండా అష్టమ శుద్ది కలిగి ఉండే లగ్నమునందు అక్షరాభ్యాసం చేయాలి. కేవలం మధ్యాహ్నం లోపుగా ఉన్న లగ్నమునందు అక్షరాభ్యాసం చేయాలి.


నిష్క్రమణ సంస్కారం
శిశువును తొలిసారిగా ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడమే నిష్కమణ. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ తొలిసారిగా బయటి ప్రపంచంలో అడుగు పెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతి శక్తుల నుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ నెల శిశువు సూర్యునికి చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ‘నిష్క్రమణ సంస్కారం’ అని పిలుస్తారు. శిశువు 4వ నెలలో సూర్యోదయ సమయాన ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. గాలి బాగా ఆడే ఇంటి బయట ప్రదేశానికి శిశువును తీసుకెళ్ళి సూర్యుడికి శిశువు శరీరాన్నంతా భక్తి శ్రద్ధలతో చూపించడం జరుగుతుంది. అదే రోజు రాత్రి సమయంలో చంద్రుడికి కూడా శిశువు శరీరం చూపడం జరుగుతుంది.

ఆ తరువాత రోజులలో కూడా కొంతకాలం పాటు శిశువును సూర్యుడికి కొన్ని నిమిషాలు చూపించడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా శిశువు ఆరోగ్యవంతంగా బుద్ధిశాలిగా ఉన్నతి పొందుతాడు.

నామకరణం
జన్మించిన శివువుకు నామకరణం జరిపించడంలో సంష్కారాల్లో ఒక భాగం. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర చరణములు ద్వారా ప్రతీ నక్షత్ర చరణమునకూ ఒక అక్షరము చెప్పబడినది. ఆ అక్షరము ఆధారంగా జన్మించినవానికి నామకరణము చేయడమనేది అనాదిగ వస్తున్న సంప్రదాయం. దీని ద్వారా ఒక్కోరాశికి 4 పాదాలుగా చేసి ఆ కాలమును అనుసరించి జన్మించిన బిడ్డకు ఆయా నక్షత్రములలోని 4 అక్షరములలో ఒకటి ముందు వచ్చునట్టుగా నామం నిర్ణయము చేస్తారు.

జాతకర్మకు వాడు నక్షత్రములు, తిధులు, వారములన్నియు నామకరణమునకు కూడా ఉపయోగించవచ్చును. మగపిల్లలకు సరి సంఖ్య అక్షరములతోను, ఆడపిల్లలకు బేసిసంఖ్య అక్షరములతోను నామకరణం చేయాలి. నామకరణ జాతకర్మ రెండును మధ్యాహ్నం 12 గంటల లోపే చేయాలి. లగ్నం నుంచి వ్యయ స్ధానంలో ఏ గ్రహం లేని ముహూర్తం నిర్ణయించవలెను. అలాగే అష్టమ శుద్ది విశేష నామము, దైవసంభంధము మాస సంబంధము ఉండునట్లు రావడం మంచిది. అర్ధం లేని పేర్లు పెట్టుట వలన దోషం ఏర్పడుతుంది.

నూతన వస్త్రధారణ
ఆది, మంగళ, శనివారములు నూతన వస్త్రధారణ చేయకూడదు. అలాగే షష్టి, ద్వాదశి, నవమి, అమావాస్య తిధులలో నూతన వస్త్రధారణ పనికి రాదు. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలలో నూతన వస్త్ర ధారణ చేయుట మంచిది కాదు. అయితే నిత్యంలో పండుగ రోజులలోనూ వస్త్రధారణ చేయుటకు వర్జ్య దుర్ముహర్తములు లేని సమయంలో చేయ వచ్చును. అంతే కాకుండా నూతనవస్త్రములకు మంగళకరమైన పసుపునకు పెట్టి ధరించవలెను.

ఉపనయనం
అక్షరాభ్యాసం అంటే లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే, పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు.

తనయుడికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు జన్మించిన వారు చేయాల్సి ఉంటుంది.

గర్భాష్టమంలోను, 11 ,13వ సంవత్సరంలోనూ కాల ప్రాధాన్యం. కాలతీతం దృష్ట్యా ముహూర్త బలం లేకపోయినా ఉపనయనం చేయవచ్చు. 16 దాటిన బ్రాహ్మణునికి ఉపనయనం మంచిది కాదు. 22 దాటిన క్షత్రియులకు 24 దాటిన వైశ్యులకు ఉపనయనం వివాహం కోసమే గానీ సంస్కారం కోసం కాదు.

వసంత ఋతువు బ్రాహ్మణులకు, గ్రీష్మ ఋతువు క్షత్రియులకు, శరదృతువు వైశ్యులకు ఉపనయనమునకు మంచిది. అయితే వసంత ఋతువు అని వాడిన కారణంగా ఉత్తరాయణమునందు ఉపనయనము చేయుటకు సంకోచము లేదు. అయితే మాఘాది పంచమాసములు విశేషంగా చెప్పిన కారణంగా మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములందు ఉపనయనము చేయు విషయమై ఆక్షేపణ అనవసరం. అయితే ప్రత్యేకించి మాఘాది పంచమాసాః అని విధించిన కారణంగా పుష్య మాసం, ఆషాఢ మాసం, ఉత్తరాయణంలో కూడుకున్నవి అయినప్పటికి ఆ మాసంలో ఉపనయన వ్రతం చేయరాదు. తదియ, పంచమి, షష్ఠి, సప్తమి తిధులు విశేషము బుధ, గురు, శుక్రవారములు మంచిది. అనూరాధ, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి, ఉత్తర, ఉత్త్రాభాద్ర, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, అశ్వని నక్షత్రములు విశేషములు అష్టమంలోను కేంద్రస్థానములైన 1,4,7,10 స్థానము లందును, పాపగరహములు లేకుండా చూసి ఉపనయనం చేయాలి. రవి వ్యయం నందు ఉండగా ఉపనయనం చేయకూడదు.

జలపూజ
ప్రసవించిన స్త్రీ జల సమీపమునకు వెళ్ళి జలపూజ చేయాలి. బుధ, గురు, శుక్ర, సోమ వారములయందును శ్రవణం పుష్యమి పునర్వసు, మృగశిర, హస్త, మూలా, అనూరాధలలో ఒక నక్షత్రము నందును శుభ తిథులలో చేయడం మంచిది. వీటికి చైత్ర, పుష్య మాసములు, మూఢమి, అధిక మాసములు వర్జ్యములు.

జాతకర్మ
ఈ సంస్కారము శిశువు భూమిపైకి వచ్చిన తరువాత చేయునది. జాతకర్మను కొన్ని ప్రాంతాలలో 'బాలసారె' అని అంటారు. జన్మించిన వెంటనే జాతకర్మ చేయాలి.  లేదా 11, 12 రోజులలో చేయవలెను.   కొన్ని ప్రాంతాలలో యవపు పిండిని, బియ్యపుపిండిని, బంగారముపై రుద్దిన తేనెను, నెయ్యిని, శిశువు నాలుకకు మంత్రోచ్చారణ జరుగుతుండగా తండ్రి రాస్తాడు.

అష్టమి, చవితి, చతుర్దశి, అమావాస్య, షష్టి వంటి తిధులు కాకుండా, మంగళ, శనివారములు కాకుండా అశ్వనీ రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి అనూరాధ, ఉషా, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, రేవతి ఈ నక్షత్రముల యందు జాతకర్మ ఆచరించాలి. జాతకర్మ మధ్యాహ్నం 12 గంటల లోపే చేయాలి.

తండ్రియే జాతకర్మ సంస్కారము చేయాలి. దీంతో ఆ శిశువుకు జన్మత సంక్రమించిన బాలారిష్టాది దోషాలు నశిస్తాయి.  ఈ సంస్కార నిర్వహణ వలన శిశువునకు దీర్ఘాయిష్యు, జన్మకాలములో సంక్రమించిన "అమంగళ యోగములు" తొలగిపోవును.  దుష్ట తిధి వార నక్షత్రములందు జననమైనచో శాంతి, ఆజ్య వీక్షణము, లేనిదే శిశువు ముఖం చూడరాదు.  ఆడపిల్ల అయిన 13 వ రోజు, మగపిల్లవాడైన  12 వ రోజు ఊయలలో పడుకుండ బెట్టవలెను.

దత్తత స్వీకారము
సంతానము లేని వారు దత్తత చేసుకోనె సంప్రదాయం ఉంది. సంతానము లేని వారు వివాహమైన తరువాత 20 ఏళ్ల వరకు సంతానం లేకపోతే, తండ్రి ఆయుష్షు అల్పమైనదని శంక కలవారు ఈ దత్తత చేసుకోవలెను. దత్తత తీసుకొనునప్పుడు, సదరు అబ్బాయి/అమ్మాయి ఆయుష్షు, కీర్తి ప్రతిభ, మొదలగు విషయములు జాతకమున పరిశీలించి యోనికూటమి, నాడికూటమిచూసి స్వగోత్రీకుల, ఇంటి నుంచి దత్తత తీసుకోవాలి.

ఈ దత్తత స్వీకారము, ఉత్తరాయణమున మధ్యాహ్నం 12 గంటల లోపున జరిపించవలెను. ఇందుకు స్వాతి, పునర్వసు, పుష్యమి, రోహిణ, అనూరాధ, హస్త, రేవతి, శ్రవణం, ఉత్తర, ఉత్తరాభాద్ర, నక్షత్రములు ఉత్తమము. చంద్రబలము, తరాబలము, కలిగి శుభగ్రహ వీక్షణ గలిగిన శుభ లగ్నమున ఈ కార్యక్రమము జరిపించ వలెను.

ధాన్యము నిల్వచేయుటకు
సాధారణ, ఉగ్ర, ఆర్ద్ర, ఆశ్రేషలను విడిచి మిగిలిన నక్షత్రముల యందు తుల, మేష, కర్కాటక లగ్నములుగా కాకుండా శుభ సమయం రోజున ఆహారము కొరకు ధాన్యము నిల్వ చేయడం మంచిది. అట్లుగాక వ్యాపారార్ధము ధాన్యము నిల్వచేయుటకు దృవ, పుష్య, విశాఖ, జ్యేష్ఠ, అశ్వనీ, చర నక్షత్రముల యందు నిల్వచేయుట మంచిది. దిమికా శ్రవన, ధనిష్ఠ, శతభిష, విశాఖ, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, పుష్య, పునర్వసు, స్వాతి, అశ్వనీ, జ్యేష్ఠల యందు ధనధాన్యములు నిల్వవుంచుటకు ప్రశస్తము.

బాలారిష్టములు
చంద్రుడు జన్మలగ్నమునందు 8వ ఇంట ఉన్నా, కుజుడు 7వ ఇంట ఉన్నా, రాహువు 9వ ఇంట ఉన్నా, శని లగ్నములో వున్నా, గురువు తృతీయంలో ఉన్నా, రవి పంచమంలో ఉన్నా, శుక్రుడు 6వ ఇంట ఉన్నా, బుధుడు 4వ ఇంట ఉన్నా, కేతువు 4వ ఇంట వున్నా బాలారిష్టములు. ఆయా గ్రహములకు జపధాన హోమములు మొదటి నెలలోనే జరిపించాలి. జనకాలమునకు అష్టమాధిపతి దశ అయినచో బాలారిష్టము అగును.

జన్మ లగ్నములో షష్ఠాధిపతి ఉన్నా, భాగ్యాధిపతి అష్టమ వ్యయంలో ఉన్నా, జన్మ లగ్నాత్ చతుర్ధాతిపతి వ్యయంలో ఉన్నా అరిష్టమే. జనన కాల దశానాధుడు షష్ఠాధిపతి కలసి ఉన్నా జననకాల దశనాధుడు వ్యయాధిపతిలో ఉన్నా బాలారిష్టం అగును. కావున వీటికి శాంతి చేయవలెను. జనకాలమునకు షష్ఠాధిపతి దశ కానీ అంతర్ధశ కానీ అయినచో ఆరోగ్య ప్రాప్తి అధికంగా ఉండును. అష్టమంలో వ్యయాధిపతి ఉండి ఆ వ్యయాధిపతి అంతర్దశ కానీ మహాదశకానీ ఉండటే గనక, ఆ గ్రహమునకు శాంతి చేయాలి. తల్లిదండ్రుల, సోదరుల నక్షత్ర జన్మంలో జననం అయితే ఏకనక్షత్ర జనన శాంతి చేయాలి. కవలలు పుట్టిన యమళ జనన శాంతి, పేగు మెడలో వేసుకొని పుట్టిన నాళవేష్టన జనన శాంతి, విషఘడియ, దుష్ట తిధి వార నక్షత్రములో పుట్టిన గ్రహణంలో పుట్టిన గోముఖప్రసవ శాంతి చేయాలి.

బీజావాపనం
అశ్వని, హస్త, పుష్యమి, చిత్త,రేవతి, మృగశిర, అనూరాధల యందును, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, స్వాతి, మూల, మఘ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషంలందు విత్తనం చల్లితే ఫలప్రదము. మంగళవారం, శనివారం, ఆదివారం రిక్తతిధులు, పంచపర్వములు, వర్జ్యఘడియలు, ప్రదోషకాలమును విడచి వృషభ, మిధున, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనుర్మీన లగ్నములందు విత్తనము వేయాలి. అంటే రవితో విడువబడు నక్షత్రము మొదలు 3 నక్షత్రములు హానిని కలుగజేయును. తర్వాత 8 వృద్ధిని కలుగచేయును. ఆ తర్వాత 9నక్షత్రములు కర్తకు మృత్యువును, ఆ తర్వాత ఏడు నక్షత్రములు లక్ష్మీప్రధమును కలుగచేయును. ఆశ్రేష నక్షత్రమందును సోమవారమందును, చంద్రుడు లగ్నమందు బలవంతుడై ఉంటే చెరుకు, అరటి, పోక మొక్కలను వేయవలెను. అశ్వనీ యందు, సూర్యుడు లగ్నమునందుండగా కొబ్బరిచెట్లు పాతించాలి. బృహస్పతి లగ్నమందును చంద్రుడు లగ్నాంశమందు ఉండగా తమలపాకుల తోటలు వేయడం మంచిది.

కృషికర్మ
మృదు, స్థిర, క్షిప్ర, చర, మూల, మఘ నక్షత్రముల యందు మొదటిసారిగా కృషి కర్మ ప్రారంభించాలి. ఆది, మంగళవారములు విడిచి చవితి, షష్ఠి, నవమి, చతుర్ధశి తిధులను దగ్ధతిధుల నుంచి విడచి మిగిలిన తిధి, వార యోగకరణ రోజులయందు కృషి కర్మ ప్రారంభించవలెను. కృషి కర్మ మేష, సింహం కుంభ కర్కట, మకర, తుల యందు ప్రారంభించకూడదు. చంద్ర శుక్రులు బలవంతులై ఉండాలి లగ్నమందు గురువు ఉండగా కృషికర్మలకు యోగ్యము.

అంత్యేష్టి
మానవుని ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి సంస్కారం. హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. వ్యక్తి తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు(అంత్యేష్టి). చనిపోయిన మనిషి భౌతిక కాయాన్ని కాల్చి (అగ్ని సంస్కారం చేసి), ఆ అస్తికలు మరియు చితా భస్మాన్ని పవిత్ర నదులలో కలపడం జరుగుతుంది...

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

108 శక్తి పీఠాలు:

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

వరలక్ష్మి వ్రతం