Rushi Panchami - Sapta Rushulu
#ఋషి_పంచమి:
భాద్రపద శుద్ధ పంచమి ని #ఋషి_పంచమి: గా వ్యవహరిస్తారు... ఈ రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, జమదగ్ని, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.
అరణ్యవాసం లో సీతారాములకు అభయమిచ్చిన వాడు అత్రి మహర్షి... సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కుల గురువు వశిష్టుడు విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి. #ఋషి_పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.
#ఋషి_పంచమి వైశిష్ట్యం:
ఋషి పంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి . వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని " #ఋషి_పంచమి " అంటారు . సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు . బ్రహ్మ విద్య నేర్వవలసిన రోజు . సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . .
గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి . సప్తఋషులే గాయత్రీ మంత్రానికి మూలగురువులు . మానవుని శరీరం లో ఏడు యోగచక్రాలు ఉంటాయి , వాటిని వికసింపజేసే వారే ఈ సప్తఋషులు .
మొట్టమొదటి సారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసిన ఆద్య హిందూ ఋషుల్ని స్మరించే శుభసందర్భం... భాద్రపద శుద్ద పంచమి .
ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలి గురువులు మిక్కిలి ప్రసన్నులయి మనం కోరిన కోరికలు తీరుస్తారు. ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికీ, వారి సంతానానికీ తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు. సంపూర్ణ ఉపవాసం అంటే రెండు పూటలు ఉపాహారము తీసుకోవచ్చు.
అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళయినా ఉపవాసం చేయాలి. సర్ప దోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వంశవృద్ధికరం. ఐశ్వర్యదాయకం.
కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదు రుణాల్లో ఋషి రుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లే మరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీ సమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!
నిజానికీ పండుగ స్త్రీలకు సంబంధించింది. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం. దీన్ని భాద్రపద మాసం శుద్ధపంచమిరోజున ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది.
ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మ దేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తోంది.
ఈ రోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రం పూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలి కూడా.
ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.
సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.
ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..
కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!
భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూల పురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశాను క్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపం లో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.
ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.
*1. కశ్యపుడు
*2. అత్రి
*3. భరద్వాజుడు
*4. విశ్వామిత్రుడు
*5. గౌతముడు
*6. జమదగ్ని
*7. వసిష్ఠుడు
వీరు ఏడుగురు పూజనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.
*1. #కశ్యప_మహర్షి:-
సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.
*2. #అత్రి_మహర్షి:-
సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి
బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.
*3. #భరద్వాజ_మహర్షి:-
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.
*4. #విశ్వామిత్ర_మహర్షి:-
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రుని చే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూల పురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతల ల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.
*5. #గౌతమ_మహర్షి:-
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరి ని భూమిపైకి తెచ్చిన మహర్షి,..
తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.
*6. #వశిష్ఠ_మహర్షి:-
ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వంద మంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
*7. #జమదగ్ని_మహర్షి:-
జమదగ్ని ఋషి- రుచిక ముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురాముని చే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్ర నమ్మకం.
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం -పాటిద్దాం
🙏శ్రీ రామ జయ రామ జయజయ రామ🙏
Comments
Post a Comment