ఈ రోజు 29-04-2018 కూర్మ జయంతి
_*ఈ రోజు కూర్మ జయంతి సందర్భంగా*
*శ్రీకూర్మం" క్షేత్రాన్ని దర్శించుకోండి!*_
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో రెండో కూర్మావతారం. కృతయుగంలో దేవ, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం మొదలు పెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకుని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగింది. ఈ ఆటంకం నుంచి బయటపడేలా అనుగ్రహించమని దేవతలు మహావిష్ణువు వేడుకున్నారు.
అప్పుడు నారాయణుడు కూర్మరూపం దాల్చి సముద్రంలోకి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మవతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మదేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అబేధాన్ని సూచించే క్షేత్రంగా విరాజిల్లుతోంది.
శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో శ్రీకాకుళం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వంశధారా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. కళింగరాజైన అనంగభీముడు కూర్మనాధస్వామి ఆలయాన్ని పునర్‌నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కర్పూరేశ్వరుడు, హఠకేశ్వరుడు, సుందేశ్వరుడు, కోటేశ్వరుడు, పాతాళ సిద్దేశ్వరుడు అనే అయిదుగురు ఈశ్వరులు క్షేత్రపాలకులుగా వున్న ఈ క్షేత్రం కళింగరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిందనీ, కళింగ రాజుల కాలంలో అత్యంత విశిష్టతను చేకూర్చిందని చరిత్ర చెబుతోంది.
కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది.
శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు.
ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట.
దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం.
శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు.
ఈ గుండంలో స్నానం చేసి ఇక్కడ వున్న విష్ణుపాదాల దగ్గర పిండప్రదానం చేస్తే పితరులకు ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం ఇక్కడ చేసిన పితృకర్మలకు గయలో పితృకర్మలు చేసిన ఫలితం లభిస్తుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక శ్రీ కూర్మ జయంతి (29-04-2018 ఆదివారం) రోజున స్వామివారిని దర్శించుకునే వారికి సకల పాపాలు హరింపవేయబడుతాయని విశ్వాసం. అలాగే ప్రతి సంవత్సరం మార్చిలో హోళీ పున్నమినాడు పెద్దఎత్తున ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కల్యాణోత్సవం, జ్యేష్ట ద్వాదశినాడు కూర్మ జయంతి నాడు జరిగే ఉత్సవాల్లో పాల్గొంటే సకల సంతోషాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment