పంచభూతాలు


🌸 *పంచభూతాల_పుట్టుక: సనాతన గ్రంధాల్లో ఎలా ఉంది?* 🌸

         "ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి" - ఈ ఐదింటినీ పంచభూతాలుగా మన పురాణాలు చెప్తున్నాయి. వీటి కలయికతోనే జీవుల్ని రూపొందిస్తోంది ప్రకృతి. మరణానంతరం తిరిగి జీవులు ఆ పంచభూతాల్లోనే లీనమౌతూ వుంటాయి. మళ్ళీ వాటినుండే పుడుతూ వుంటాయి. జీవుల జనన మరణ చక్రం పంచభూతాల వల్లనే నడుస్తోంది.

         ప్రకృతిని ' బ్రహ్మ ' గా ఆరాధించినట్లుగానే మనవాళ్ళు ప్రాచీనకాలం నుండీ పంచభూతాలనూ ఆరాధిస్తున్నారు. అనంతమైన ఆకాశాన్ని నీలమేఘశ్యాముడైన విష్ణువుగానూ, గాలిని వాయుదేవునిగానూ, అగ్నిని అగ్నిదేవునిగానూ, నీటిని వరుణదేవునిగానూ, భూమిని భూదేవిగానూ పూజించే సాంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చారు. (భూమిని శివునిగా భావించగల విజ్ఞానం సాధారణ ప్రజానీకానికి లేదు. సామాన్యుల దృష్టిలో భూమి, భూదేవిగానే లెక్క). మనకు జీవాన్నిచ్చే ప్రతి శక్తి యెడలా కృతజ్ఞత, భక్తిభావాలు హైందవుల కున్నాయి.

         పంచభూతాల యొక్క ఆవిర్భావం గురించి, గుణధర్మాలను గురించి, విశిష్టత గురించి, వాటి సమ్మేళనం గురించి, వాటి అంశీభూతాలను గురించి విదేశీ విజ్ఞానులకంటే మన ప్రాచీన ఋషీశ్వరులకు ఎక్కువగా తెలుసు.

         ఈ పంచభూతాలు ఒకదాని నుండి ఒకటి వరుసగా యెలా ఉద్భవించాయో, మన "భాగవత గ్రంథం" స్పష్టంగా చెప్తోంది. మొట్టమొదటగా "ఆకాశము" ఉన్నది. భగవంతుని దృష్టి పడగా ఆకాశము నుండి స్పర్శగుణము గల "వాయువు" పుట్టింది. వాయువు ఆకాశముతో కలిసి రూపాంతరం పొంది, రూపము గల "తేజస్సు (అగ్ని)" పుట్టింది. అది లోకప్రకాశకమైనది. తేజస్సు వాయువుతో కలిసి రూపాంతరం పొంది, రసగుణం కలిగిన "జలం (నీరు)" పుట్టింది. తేజస్సు, నీరు కలిసి "భూమి" పుట్టింది. పంచభూతాల పుట్టుక పై విధంగా కొనసాగినట్లుగా "భాగవతం" చెప్తోంది. ఆధునిక సైన్సు ఈ విషయాన్ని నూటికి నూరుపాళ్ళూ సమర్థిస్తోంది. అదెలా అంటే చూడండి.

         ముందుగా అనంతమైన "ఆకాశం" ఉంది. ఆ ఆకాశం లో భూమి ఒక వాయుగోళంగా (సూర్యుడు అనబడే పెద్ద వాయుగోళం నుండి) అవతరించింది. ఆకాశం నుండి "వాయువు" రావడం అంటే అదే! వాయుగోళమైన భూమి, తనలోని వాయువుల కారణంగా మంటలతో ప్రజ్వరిల్లింది. వాయువు నుండి "తేజస్సు (అగ్ని)" ఉద్భవించడం అంటే అదే! అగ్నితో ప్రజ్వరిల్లే భూమి మెల్లగా చల్లబడుతూ నీటిగోళం గా మారింది. ఆ విధంగా అగ్ని నుండి "నీరు" ఏర్పడిందన్నమాట. నీటి నుండి మెల్లగా "భూమి" ఏర్పడి, అక్కడక్కడా పైకి తేలి, ప్రస్తుతపు భూగోళస్థితిని పొందింది.

చూశారా! మన భాగవతం చెప్పినట్లుగా పంచభూతాలు ఒకదాని నుండి మరొకటి పుట్టిన విధానం, సైన్సు ప్రకారం కూడా నిరూపితమయింది. ఈ విషయం మన భారతీయులకెంతో గర్వకారణం.

         🌹 *నేల ప్రాంతం కంటే నీటి ప్రాంతం ఎక్కువ :*

         పంచభూతాల్లో ఏది ఎన్నోవంతు ప్రకృతిలో ఆవరించి వున్నదో మన "భాగవతం" స్పష్టంగా చెప్తోంది. కోటి యోజనముల "భూమి" , 10 కోట్ల యోజనముల "నీరు" , 20 కోట్ల యోజనముల "తేజస్సు(అగ్ని)" , 30 కోట్ల యోజనముల "గాలి" , 40 కోట్ల యోజనముల "ఆకాశము" కలవట. కాలగమనమున భూగోళముపై సముద్రప్రాంతాలు, నేలప్రాంతాలు వివిధరకాలుగా మారుతూ వస్తున్నాయి. ఖండాల ఆకారాలు కాలక్రమేణా రకరకాలుగా మారుతూండడం ఆధునిక శాస్త్రవేత్తలకు తెలుసు. ఏవి యెలా మారినా "భూగోళం మొత్తం మీద నేలప్రాంతం కంటే నీటిప్రాంతం ఎక్కువ" అని నేటి శాస్త్రజ్ఞులు చెప్పారు. "భాగవతం" ఇచ్చిన పై లెక్క ప్రకారం ఈ విషయం కూడా నిరూపణ అవుతోంది.

        🌺 *పంచభూతాల గుణగణాలు :*

         పంచభూతాల గుణాలు కూడా "భాగవతం" లో ఇవ్వబడ్డాయి.

         పంచభూతాలు వాటి గుణాలు...

              ! శబ్దం | స్పర్శ | రూపం | రసం | గంధం
------------------------------------------------------------
భూమి    !   ★   !  ★  !    ★     !   ★   !   ★ 
-------------------------------------------------------------
జలం      !   ★   !  ★   !   ★     !   ★   !
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼       
అగ్ని       !   ★   ¡   ★  ¡   ★      ¡         ¡       
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
వాయువు!  ★  ¡   ★  ¡             ¡         ¡
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼                 
ఆకాశం     !   ★   ¡         ¡             ¡         ¡                                 

         మన ప్రాచీన ఋషీశ్వరులకు పంచభూతాల గుణాలే కాదు, ఆ యా గుణాల వల్ల వాటికి ఏర్పడిన శక్తులు కూడా తెలుసు. ఆ వివరాలను చర్చించుకుందాం.

పైన తెలిపిన 5 గుణాలూ ఉండడం వల్ల భూమి భారంగా ఉందట. ప్రవహించి, వ్యాపించే శక్తి దానికి లేదు. భూమికి గల ' గంధం(వాసన) ' అనే గుణం జలముకు లేదు. అందువల్ల 5 గుణాల్లో ఒక గుణం తగ్గిపోవడం తో జలానికి పైనుండి క్రిందకు ప్రవహించే శక్తి వచ్చింది. మూడవది అగ్ని. దీనికి శబ్ద, స్పర్శ, రూప గుణాలే వున్నాయి. జలానికి గల ' రసము(రుచి) ' అనే గుణం అగ్నికి లేదు. ఇలా ఒక గుణం తగ్గడం వల్ల పైకీ, క్రిందకూ పోగల శక్తి అగ్నికి వచ్చింది. ఒక్కొక్క గుణం తగ్గుతూంటే, ఒక్కొక్క రకం శక్తి కలుగుతూండడం గమనించండి. నాలుగవది వాయువు. దీనికి శబ్ద, స్పర్శ

 గుణాలే వున్నాయి. అగ్నికి గల ' రూపం(ఆకారం) ' అనే గుణం వాయువుకు లేదు. ఇలా ఒక గుణం తగ్గడం వల్ల వాయువు బాగా తేలికయింది. పైకీ, క్రిందకూ, ప్రక్కలకూ, ఇలా అన్నివైపులా అతి సులభంగా సంచరించగల శక్తి దానికి వచ్చింది. ఐదవది ఆకాశం. దీనికి వున్నది ' శబ్దగుణం ' ఒక్కటే! వాయువుకు వున్న ' స్పర్శగుణం ' దీనికి లేదు. ఇలా ఒక గుణం తగ్గడం వల్ల, వాయువు లేనిచోట కూడా అంతటా వ్యాపించి వుండగల శక్తి ఆకాశానికి వచ్చింది. ఇలా పంచభూతాలకు ఒక్కొక్కదానికి ఒక్కొక్కగుణం తగ్గేకొలది, ఒక్కొక్కరకం శక్తి పెరుగుతూ వచ్చింది. ఈ సందర్భములో మరో విచిత్రం చూడండి. భగవంతునకు, ఆకాశానికి వున్న ' శబ్దగుణం ' కూడా లేదు. గుణాతీతుడు ఆయన. ఆ కారణంగానే ఆయన ఆకాశం లేనిచోట కూడా మొత్తం విశ్వమంతా ప్రతి అణువులోనూ వ్యాపించి ' సర్వాంతర్యామి ' అయ్యాడు.

         పంచభూతాల యొక్క, భగవంతుని యొక్క శక్తులను గురించి మన పురాతన గ్రంథాల్లో ఇంత చక్కని పరిశీలనాత్మక వివరణ ఇవ్వబడింది. ఆధునిక సైన్సు ఈ విషయములో చాలా వెనుకబడి వుంది.

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

ద్రాక్షారామం దగ్గర నక్షత్ర దేవాలయాలు

108 శక్తి పీఠాలు:

ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి?

హోమము వలన కలుగు లాభములు

108 Temples around Draksharamam

శని జయంతి 15.5.2018